ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం

  • ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు
  • ఎకరంలో సేంద్రియ దోస సాగు
  • రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు
  • 23 రోజుల్లోనే భారీగా లాభాలు
  • యూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీ
ఖరీదైన చదువులు చదివి, నగరాల్లో ఐదంకెల జీతం కోసం క్యూ కట్టే రోజులివి. కానీ, ఆ యువకుడు మాత్రం కొలువుల కంటే సొంతూరి మట్టిలోనే ఎక్కువ లాభం ఉందని నమ్మాడు. కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సేంద్రియ సాగుతో కేవలం మూడు వారాల్లోనే ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఐటీఐ చదువు నుంచి
ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అఖిలేష్ మౌర్య ఐటీఐ పూర్తి చేసిన తర్వాత మిగతా యువకుల్లా ఉద్యోగం కోసం నగరాల బాట పట్టలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని దగ్గరగా చూడటం వల్ల అతడికి కూడా సాగుపైనే ఆసక్తి పెరిగింది. చదువు పూర్తయ్యాక సొంత ఊరికి తిరిగొచ్చిన అఖిలేశ్‌ స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాడు. సంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలనిచ్చే కూరగాయల సాగును ఎంచుకోవాలని అధికారులు ఇచ్చిన సలహా అతడి ఆలోచనను పూర్తిగా మార్చేసింది.

దోస సాగు
అధికారుల మార్గదర్శకత్వంలో అఖిలేశ్‌ ఒక ఎకరం పొలంలో ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ దోసకాయల సాగును ప్రారంభించాడు. మార్చి నెలలో రైజ్డ్ బెడ్ పద్ధతిని ఏర్పాటు చేసి నీరు వృథా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమర్చాడు. సింజెంటా, క్లాస్ అర్నో, ఢిల్లీ ఎస్ఐఆర్ లాంటి నాణ్యమైన దోస రకాలను ఎంచుకొని మొక్కలు నాటాడు. మే నెల మొదటి వారం నుంచే తోట నుంచి దిగుబడి రావడం మొదలైంది. ప్రస్తుతం ఈ తోట నుంచి రోజుకు ఏడెనిమిది క్వింటాళ్ల చొప్పున నాణ్యమైన దోసకాయలు చేతికి వస్తున్నాయి. మే ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 10 టన్నుల పంటను అఖిలేష్ మార్కెట్లో విక్రయించాడు.

తక్కువ పెట్టుబడి
ఈ ప్రాజెక్ట్ కోసం అఖిలేష్ పెట్టిన మొత్తం పెట్టుబడి కేవలం రూ.30 వేలు మాత్రమే. ఇందులో డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి కొనుగోలు, పొలం తయారీ ఖర్చులు కలిసి ఉన్నాయి. ప్రారంభంలో మార్కెట్లో దోసకాయ ధరలు కిలోకు రూ.14 వరకు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ పెరిగి ధర రూ.20 దాటింది. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల అఖిలేశ్‌కు కేవలం 23 రోజుల్లోనే రూ.లక్షన్నర ఆదాయం సమకూరింది. సరైన ప్రణాళిక, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితోనే అద్భుతమైన లాభాలు సాధించవచ్చని అఖిలేశ్‌ నిరూపించాడు. ప్రస్తుతం రోజుకు ఏడెనిమిది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Akhilesh Maurya
organic farming
cucumber farming
ITI graduate
Uttar Pradesh agriculture
modern farming techniques
drip irrigation
vegetable farming
Indian farmers
organic cucumber

More Telugu News